అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిలిచిపోవడం.. ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. మూడు రోజుల కిందటి వరకు రోజుకు 6 వేల పరీక్షలు చేయగా.. ప్రస్తుతం 5 వందల పరీక్షలైనా చేయటం లేదు. జిల్లా వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌లో 10 వేలకు పైగా శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్న కారణంగా... తాత్కాలికంగా పరీక్షలు నిలిపివేశారు. ఈ కారణంగా.. అనుమానిత లక్షణాలు ఉన్నవారు ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
అవకాశంగా తీసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు... టెస్టుల కోసం రూ. 3 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన నమూనాల ఫలితాలను వారం దాటినా వెల్లడించటం లేదు. దీంతో వైరస్ బారిన పడిన వారు సకాలంలో చికిత్స పొందలేకపోతున్నారు. వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతమవుతోంది. సకాలంలో వ్యాధిని గుర్తించక మరణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.