Stone Pelting Between TDP YCP Leaders : రాప్తాడు అభివృద్ధిపై గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి హరికృష్ణారెడ్డి టీడీపీ నేతలపై పలు ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజులుగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సామాజిక మాధ్యమాలు వేదికగా గొడవ జరుగుతోంది. ఇవాళ వైసీపీకి చెందిన హరికృష్ణారెడ్డి గుంటూరు నుంచి రాప్తాడు టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి మరోసారి సవాల్ చేస్తూ, టవర్ క్లాక్ వద్దకు రావాలని రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు చేరుకోవటంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించాక, హరికృష్ణారెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేవలం టీడీపీ కార్యకర్తలను అదుపు చేయటానికి మాత్రమే యత్నిస్తుండడం, వైసీపీ కార్యకర్తలను, హరికృష్ణారెడ్డిని నిలువరించకపోవటంతో పరస్పరం రాళ్లదాడికి దిగారు. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌తో పాటు, టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. హరికృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు రోజులుగా వైరల్ అవుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరింత రెచ్చిపోయిన హరికృష్ణారెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఆరోపణల తీవ్రత పెంచి, ఏకంగా టవర్ క్లాక్ వద్దకు వచ్చి దాడులకు దిగినట్లు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి :అనంతపురం జిల్లా రాప్తాడులో పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ గుంటూరుకు చేరింది. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. పరిటాల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అటువైపు వ్యక్తి దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో ఉండి మాట్లాడటం కాదు.. రాప్తాడుకు వస్తే ఎవరు ఏంటో తెలుస్తుందంటూ సవాల్ విసిరారు.