RTC Employees Protest: ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ తెలిపారు. ఏ క్షణం నుంచైనా సమ్మెకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సహాయ నిరాకరణ, నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, భోజన విరామ సమయంలో ధర్నాలు చేపడతామని నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు కోల్పోతున్న తమ హక్కులను సాధించుకునేందుకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు కార్మికులు ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సమయంలో సంబరపడిన మేము.. హక్కులు కోల్పోతున్నందునే ఆందోళన చేపట్టాల్సి వస్తోందని కార్మికులు స్పష్టం చేశారు.
విశాఖలో ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్సీ సాధన సమితి చేపట్టిన సమ్మెకు మద్దతుగా నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జీల కార్యక్రమం చేపట్టారు.