ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి' - protest in vizag district

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు టోల్​ప్లాజాల వద్ద సీపీఎం నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల నుంచి టోల్ వసూలు చేయకుండా అడ్డుకున్నారు.

state-wise-protest-at-tollplazas-for-demand-to-cancelation-of-agriculture-laws
అనంతపురం జిల్లాలో ఆందోళన

By

Published : Dec 12, 2020, 8:26 PM IST

విజయనగరం జిల్లాలో...
కార్మిక వర్గాలను, కార్మిక చట్టాలను భాజపా ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ ఛైర్మన్ ఎస్.వి. శ్రీనివాస్ విమర్శలు చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన... దేశంలో ఉపాధి రంగ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో చట్టాలు చేసిందని అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయ చట్టాలతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం జిల్లాలో...
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ కోరింది. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా విశాఖ కెప్టెన్ రామారావు కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అనంతపురం జిల్లాలో...
దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా... అనంతపురం జిల్లా కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద 44 నెంబర్ జాతీయ రహదారిపై విద్యార్థి, వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో మోదీ ప్రభుత్వం చట్టాలు రద్దు చేయకుండా సవరణలు చేస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ రుసుము వసూలు చేయనీయకండా అడ్డుకున్నారు.

కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద 42వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు వారాలుగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేతలు అన్నారు.

కర్నూలు జిల్లాలో...
కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని టోల్ ప్లాజా వద్ద వామపక్ష పార్టీల రైతు సంఘాల నాయకులు ధర్నా చేశారు. రహదారిపై వెళ్లే వాహనాలకు రుసుము లేకుండా పంపించారు. రైతులకు ప్రయోజనం లేని చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో మాఫియా శక్తులు స్వైర విహారం'... డీజీపీకి చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details