ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి' - విశాఖ ఉక్కు పరిశ్రమ

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. లేనిపక్షంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

state wide protest against steel plant privatization
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి'

By

Published : Feb 26, 2021, 5:37 PM IST

అనంతపురం జిల్లాలో...

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామని అనంతపురంలో ఆల్ఫ్రెడ్ యూనియన్ నాయకులు అన్నారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద రాస్తారోకో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ నాయకులు... ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకుంటే... ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో...
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. గుంటూరులో కార్మిక సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించారు. అందుకోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. నరసరావుపేటలోని గుంటూరు - కర్నూలు రహదారిపై ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, ప్రభుత్వాలు చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో...

స్వల్ప నష్టాలను సాకుగా చూపి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం దారుణమని వామపక్ష నేతలు విమర్శించారు. నెల్లూరులో ఆందోళన నిర్వహించిన వామపక్ష నేతలు... రాస్తారోకో చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా తణుకులో వామపక్షాలు, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో రాస్తారోకో చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పోరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్​ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం జిల్లాలో...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ... విశాఖలో వామపక్షాల నేతలు రాస్తారోకో చేపట్టారు. ప్రధాని మోదీ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలని కోరారు.

విజయవాడలో...

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... విజయవాడలో ఏపీఎన్జీవో నేతలు నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం పునరాలోచించాలని కోరారు.

ఇదీచదవండి.

పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details