State Health Director at Belodu Village: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి సందర్శించారు. అనంతపురం డీఎంహెచ్‌ఓ వీరబ్బాయితో కలిసి అనంతపురం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. బేలోడు గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి వారు పర్యటించారు.
గ్రామంలో తాగునీటి పైప్ లైను, కుళాయిలు నేలమట్టం కంటే కింది భాగంలో ఉండటం వల్ల గుంతల్లో నిలిచిన నీరు పైపుల్లోకి వెళ్లి ఉంటుందని.. అందువల్ల తాగునీరు కలుషితమైనట్లు వెల్లడించారు. తాగునీటి పైపుల్లో నీరు కలుషితం కావడం వల్ల గ్రామంలో డయేరియా వ్యాధి వ్యాపించి 33 మంది వాంతులు, విరేచనాలతో రాయదుర్గం, అనంతపురం, కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.
గ్రామంలో గ్రామ పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంపూర్ణ పారిశుధ్య చేపట్టి సురక్షితమైన తాగునీరు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తాగునీరు కలుషితం కాదని, ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వెల్లడించడం తమను పక్కదారి పట్టించేదిగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.