అనంతపురం జిల్లాలో ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీల సీనియార్టీ జాబితా సిద్ధమైంది. నెల రోజులుగా సాగుతున్న ప్రక్రియలో కీలక ఘట్టం బుధవారం రాత్రితో పూర్తయ్యింది. జాబితాలో తప్పిదాలు ఉంటే అభ్యంతరాలు తెలపడానికి మరో మూడు రోజులు అవకాశం కల్పించారు. మరోవైపు అడ్డదారుల్లో పాయింట్లు పొందడానికి ప్రయత్నించిన 64 మందిని ప్రిఫరెన్షియల్ జాబితా నుంచి తొలగించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద 292 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పలు రోగాలకు సంబంధించి 141 మంది వివరాలను మెడికల్ బోర్డుకు నివేదించారు.
సంబంధిత వైద్యులు పరిశీలించి 62 మంది జీఓల్లో లేని రోగాలు చూపడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు సరైన ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో వారికి పాయింట్లు తొలగించారు. జిల్లాలో 7,040 మంది ఉపాధ్యాయులకు సంబంధించి పాయింట్లు, సీనియార్టీ ఇతరత్రా అంశాలన్నీ అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై డీఈఓ శామ్యూల్ మాట్లాడుతూ చిన్న తప్పిదం కనిపించినా తక్షణమే అన్ని ఆధారాలు పరిశీలించి నిర్ణయం తీసుకున్నామన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే పక్కాగా చేపట్టామన్నారు.