సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పులిపార్వేట నయనందకరంగా సాగింది. ఉదయం అర్చకులు స్వామివారిని రంగమండపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారితో పాటు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి కదిరి కొండ నరసింహాలయానికి తీసుకెళ్లి అక్కడ భక్తుల మధ్య విశేషపూజలు నిర్వహించారు. ఏడాదికోసారి జరిగే పార్వేటను తిలికించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో కదిరి కొండ ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం పాలపొంగుల ఉట్టి వద్దకు స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి పొంగులు నిర్వహించారు. అనంతరం రైల్వేస్టేషన్ సమీపంలోని మండపంలో భక్తుల దర్శనార్థం స్వామివారు ఆశీసునులయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అక్కడే సంప్రదాయబద్దంగా పులిపార్వేట నిర్వహించారు. కుందేలును పట్టుకుకోవడానికి వయస్సుతో సంబంధం లేకుండా పురుషులు పోటీపడ్డారు. తరువాత స్వామి వారు ఊరేగింపుగా రాయచోటి రోడ్డులోని శమీ మండపానికి చేరుకున్నారు. ఇక్కడ స్వామి వారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తుల దర్శనానంతరం నగర పురవీధుల గుండా స్వామి వారు దేవాలయానికి చేరుకున్నారు.