ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామలింగేశ్వరాలయం : శిల్పం అపురూపం..! ఆదరణ అధ్వానం..!!

కాశీ విశ్వేశ్వరుడి ఆలయం తరహాలో నిర్మితమైన ఆ గుడికి.. అత్యంత గొప్ప చరిత్ర ఉంది. విరూపాక్ష రాయల కాలంలో ఆలయ నిర్మాణం కోసం పెన్నానది ప్రవాహ దిశనే మార్చి అప్పటి ఇంజినీరింగ్ చాతుర్యాన్ని చాటారు! ఎంతో.. అపురూపమైన శిల్పసందపదకు నిలయమైన ఆ ఆలయం నేడు.. ప్రాభవం కోల్పోతోంది. ఇంతకీ.. ఆ గుడి ఎక్కడుంది? దాని ప్రత్యేకథలు తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.

అపురూపమైన శిల్పకళకు నిలయం
అపురూపమైన శిల్పకళకు నిలయం

By

Published : Oct 27, 2021, 4:29 PM IST

రాయలసీమ ప్రాంతంలో.. శ్రీకృష్ణదేవరాయ వంశీయులు నిర్మించిన ఎన్నో ఆలయాలు గుర్తింపునకు నోచుకోవటంలేదు. అత్యంత అరుదైన శిల్పసంపద, ప్రత్యేక శిలతో చెక్కిన అనేక శిల్పాలు ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి. ఈ కోవకే చెందుతుంది.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నానది ఒడ్డున ఉన్న వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం.

అపురూపమైన శిల్పకళకు నిలయం

దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం కోసం అప్పటి ఇంజినీరింగ్ నిపుణుడు రామాచారి పెన్నానది దిశనే మార్చినట్లు స్థల పురాణం చెబుతోంది. నాటి మండలాధీశుడు పెన్నసాని వంశీయుడైన రామలింగ నాయుడుకు.. రామలింగేశ్వరుడు కలలో కనిపించి పెన్నానది నీటిలో ఉన్నానని, తనకు ఆలయం నిర్మించమన్నట్లు చెప్పాడట. దీంతో.. రామలింగ నాయుడి అభ్యర్థన మేరకు విరూపాక్ష రాయలు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారంగా అర్చకులు చెబుతున్నారు.

తాడిపత్రిలోని బుగ్గలింగేశ్వర ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. ఉత్తరం దిశగా పెన్నానది ప్రవాహం, దక్షిణాన శ్మశానవాటిక వంటివి కాశీలో విశ్వేశ్వరుని ఆలయ తరహాలో ఇక్కడ ఉన్నట్లు అర్చకులు చెబుతారు. శివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులపై రామలింగేశ్వరుడి లింగం కింద భాగంలో ప్రవహించే పవిత్ర జలాన్ని అర్చకులు చల్లుతారు.

ఎంతనీరు తీసినా ఏమాత్రం ఊటలు తగ్గకుండా ఉండటం బుగ్గలింగేశ్వరుడి ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగంలో రాజరాజేశ్వరి, కోదండ రామాలాయాలు ఉన్నాయి. పర్వదినాల్లో, పండగల సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. క్రీ.శ. 1740 ప్రాంతంలో పెన్నానది ఆలయ గోపురం మీదుగా ఉద్ధృతంగా ప్రవహించటంతో గోపురం కొట్టుకుపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున బుగ్గరామలింగేశ్వరుడిపై సూర్యకిరణాలు పడటం ఆలయ నిర్మాణంలో అలనాటి సాంకేతికతకు నిదర్శనం. ఇంతటి గొప్ప శిల్పకళ సంపదతో కూడిన బుగ్గరామలింగేశ్వరుడి ప్రతిష్ఠ అందరికీ తెలిసేలా ప్రభుత్వం చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!'

ABOUT THE AUTHOR

...view details