అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల కొరతతో చేతి తొడుగులు కొనటం సమస్యగా మారింది. బోధనాసుపత్రికి వచ్చే మందుల బడ్జెట్ లో ఇరవై శాతం నిధులను నగదు రూపంలో నేరుగా పాలనాధికారి ఖాతాకు జమచేస్తారు. ఆసుపత్రికి ఏటా 6.85 కోట్ల రూపాయల మందులు కేటాయిస్తున్నారు. అత్యవసర మందులకు 1.20 కోట్లు, సర్జికల్ వస్తువుల కోనుగోలుకు 67 లక్షల రూపాయలు ఏటా నగదు రూపంలో ఇస్తున్నారు.
సర్జికల్ వస్తువుల సంగతేంటి...
మందుల కొనుగోలు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, సర్జికల్ వస్తువుల కొనుగోలుకు ఏడాది కాలంగా ఒక్కరూపాయి కూడా ఖాతాకు జమకాలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 48 లక్షల రూపాయలే ఇచ్చారు. 2020-21 ముగిసినప్పటికి నేటికీ ఒక్క రూపాయ కూడా అందలేదు. ఈ నిధులు రాకపోవటంతో ఆసుపత్రిలో రోజూవారీగా వైద్యులు, నర్సులకు చేతి తొడుగులు సమకూర్చుటం కూడా అధికారులకు సమస్యగా మారింది. ఏరోజు కారోజు 3000 చేతితొడుగులు ప్రభుత్వ జెమ్ పోర్టల్ నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. సర్జికల్ వస్తువుల కొనుగోలుకు నిధుల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.
సమస్యల సంద్రంగా మారిన ఆసుపత్రి
అనంతపురం ఆసుపత్రిలోని వార్డుల్లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఐదు నెలలపాటు ప్రధాన ఆసుపత్రిని కరోనా వైద్యానికి కేటాయించారు. దీంతో అన్నివార్డుల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను పెద్దఎత్తున వినియోగించటంతో పాత వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్లు ఏర్పడ్డాయి. వీటికి ఎప్పటి కప్పుడు మరమ్మత్తు చేయాల్సిరావటంతో వ్యయం పెరిగింది. ఏసీలు, కంప్యూటర్లు, వైద్య యంత్రాల స్పల్ప రిపేర్లకు ఊహించని ఖర్చులు అనేకం ఎదురౌతున్నాయి. వీటన్నింటికీ ప్రతినెలా కనీసం నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ నిధులన్నీ హెచ్‌డీఎస్ ఖాతా నుంచి వెచ్చించుకోవాల్సి ఉంది.