అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు బాధితులు.. పరిహారం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా... అధికారులు కరుణించట్లేదు. 10 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ ఉంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో.. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామాన్ని.. గతంలో రెవెన్యూ అధికారులు అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. మొత్తం 809 మంది నిర్వాసితులు ఉండగా.. 409 మందికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలినవారికి.. పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. కనీసం ఇళ్లలో సామానులు తీసుకునే అవకాశమూ లేకుండా నీళ్లు వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ నిరుపేదలు.. పరిహారం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం నిండా ముంచిందని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు.
రాఘవంపల్లి గ్రామమూ ముంపునకు గురైంది. అందులో 33 మందికి పరిహారం అందించాల్సి ఉండగా.. దాని కోసం బాధితులు ముప్పుతిప్పలు పడుతున్నారు. అందరితో సమానంగా పది లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఏడు లక్షలే ఇస్తామని చెబుతున్నారని వెల్లడించారు. కనీసం అవి ఇచ్చేందుకూ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి.. ఆర్డీటీ సంస్థ కట్టించిన ఇళ్లనూ ప్రభుత్వమే కట్టించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.