ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు.. - Problems in jagananna colonies in anantapur district

అనంతపురం జిల్లాలోని జగనన్న కాలనీల్లో సమస్యలు లబ్దిదారులకు కంటతడిపెట్టిస్తున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో.. ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. నేడు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సొంతంగా ఇల్లు కట్టుకుందామంటే ఇసుక, కూలీల కొరత, వర్షం వస్తే ముంపు.. ఇలా విభిన్న సమస్యలతో వెంటాడుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.

problems in jagananna colonies
జగనన్న కాలనీల్లో సమస్యలు

By

Published : Aug 18, 2021, 4:51 PM IST

జగనన్న కాలనీల్లో సమస్యలు

అనంతపురం జిల్లాలో పేదల ఇళ్ల కోసం 407 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. వీటిలో లక్ష 12 వేల మందికి పట్టాలు పంపిణీ చేశారు. వీరికి ఇల్లు కట్టించే విషయంలో ప్రభుత్వం లబ్దిదారులకు మూడు రకాల ఐచ్ఛికాలు(ఆప్షన్స్) ఇచ్చింది. దీనిలో మొదటిది.. 'ప్రభుత్వం డబ్బులిస్తుంది లబ్దిదారుడే ఇల్లు నిర్మించుకోవాలి'. రెండోది 'ప్రభుత్వం 1.80 లక్షల రూపాయల విలువైన నిర్మాణ సామాగ్రి ఇస్తుంది.. లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి'. ఇక మూడో ఐచ్ఛికంలో 'ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు కట్టిస్తుంది, లబ్దిదారుడు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు'. అయితే లబ్దిదారులు చాలామంది ప్రభుత్వం ద్వారానే ఇల్లు కట్టించుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో మూడో ఆప్షన్ ను ప్రభుత్వం తొలగించింది.

పునాది స్థాయిలో

ప్రస్తుతం ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు లబ్దిదారుడి ఖాతాకు జమచేయటంకాని, లేదా అంతే విలువైన సామగ్రిని కానీ ఇవ్వాల్సి ఉంది. తామే ఇల్లు కట్టుకుందామని భావించిన కొందరు లబ్దిదారులు పునాదులు తీసి సిద్ధం చేసుకోగానే భారీ వర్షాలు రావటంతో ఇంటిస్థలాలు నీట మునిగాయి. ఇల్లు నిర్మించుకుంటున్న వారికి మేస్త్రీలు చుక్కలు చూపుతున్నారు. అధికంగా కూలీ డిమాండ్ చేయటమే కాకుండా పని మొదలు పెట్టిన తర్వాత మరో చోట ఎక్కువ కూలీ ఇస్తున్నారనే నెపంతో మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. అన్నిచోట్ల ఇలాంటి సమస్యలే తలెత్తడంతో చాలావరకు ఇళ్లు... పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి.

నీటి కొరతతో క్యూరింగ్ సమస్యలు..

అనంతపురం జిల్లాలో ఈ విధంగా తొలి ఐచ్ఛికం ఎంచుకున్న వారు 41,600 మంది ఉండగా, రెండో ఐచ్ఛికం 17,000, మూడో ఐచ్ఛికం 43,000 మంది ఎంపిక చేసుకున్నారు. మూడో ఐచ్ఛికం ఆన్ లైన్​ నుంచి తొలగించటంతో అప్పటికే ఎంపిక చేసుకున్న వారికి సమాధానం చెప్పేవారే లేరు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 45 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 66,100 మందికి జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 407 లో 271 కాలనీల్లో లబ్దిదారులు అక్కడక్కడా ఇళ్లు నిర్మాణం మొదలు పెట్టారు. అయితే చాలాచోట్ల నిర్మించుకుంటున్న ఇంటికి సిమెంట్ క్యూరింగ్ చేయటానికి నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ లేఔట్లలో కొన్ని చోట్ల బోర్లు వేసి, నీరు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల బోర్లకు మోటర్లు బిగించలేదు. ఇంకొన్ని చోట్ల బోర్లు వేసినా నీరు పడలేదు. ఇలా అనేక సమస్యలతో లబ్దిదారులు లేఔట్లలో ఇంటి నిర్మాణానికి దిగుతున్నారు.

పట్టా రద్దు చేస్తామని బెదింపులు..

ఇల్లు నిర్మించుకోకపోతే ఇంటి పట్టా రద్దు చేస్తామని కొందరు అధికారులు లబ్దిదారులను బెదిరించారు. దీంతో గుత్తి ఆర్ఎస్​లో లబ్దిదారులు పెద్దఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సదుపాయాలు కల్పించకుండా, లేఔట్లలో మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా, ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పిన హామీ అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతూ, పట్టాలు రద్దు చేస్తామనటాన్ని లబ్దిదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. దీంతో గుంతకల్లు హౌసింగ్ డీఈ రామకృష్ణారెడ్డి పట్టాలు రద్దుచేయాలనే నిర్ణయం జరగలేదని, లబ్దిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని కిందిస్థాయి సిబ్బంది చెప్పి ఉంటారని ఆయన అన్నారు. ఎవరి పట్టాలు రద్దు చేయటం జరగదని డీఈ స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ..High Court: ఉపాధి హామీ పెండింగ్ నిధుల చెల్లింపుపై.. హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details