రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సరైన మార్కెట్, ధరలను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కిసాన్ స్పెషల్ రైలు ప్రకటించింది. దీనిపై చర్చించేందుకు వర్చువల్ సమావేశం ఏర్పాటుచేశారు. గుంతకల్లు డివిజన్ డీఆర్ఎమ్ అలోక్ తివారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొన్న ఈ వర్చువల్ మీటింగ్లో 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగన్న , ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గందం చంద్రుడు పాల్గొన్నారు.
రకరకాల పండ్ల ఉత్పత్తికి జిల్లా పేరు పొందిందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టికల్చరల్గా ప్రఖ్యాతి చెందిందని కలెక్టర్ అన్నారు. ప్రధానంగా తీపి నిమ్మ , దానిమ్మ , పుచ్చకాయలు మొదలైన పండ్లతో పాటు కూరగాయల సాగు జరుగుతోందన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా దిల్లీ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తున్నామన్నారు. అయితే పండ్లు గమ్యస్థానం చేరేలోగా చెడిపోయే అవకాశం ఉందన్నారు.
రైల్వే ద్వారా పండ్ల రవాణాలో కలిగే ప్రయోజనాలను డివిజనల్ రైల్వే అధికారులు సమావేశంలో వివరించారు. అనంతపురం జిల్లాలోని వివిధ స్టేషన్ల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కిసాన్ స్పెషల్ రైళ్ళను నడిపే అవకాశాల గురించి చర్చలు జరిగాయి. రైతులు, వ్యాపారులు ప్రధానంగా అక్టోబర్ నుంచి మే నెల వరకు రోజువారి రైళ్లను నడపాలని కోరారు. మిగతా నెలల్లో వారానికి ఒకసారి లేదా 2 వారాలకొసారి నడపాలని సూచించారు. అనంతపురం , ధర్మవరం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు. భోపాల్, ఝాన్సీల వద్ద లోడింగ్, అన్ లోడింగ్ కోసం ఆపాలన్నారు.