అనంతపురం జిల్లా కదిరిలో కర్ఫ్యూ ఆంక్షల అమలు తీరును జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందని... నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా అమలు చేయాలని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో ఆటోలు, టాక్సీలు, తదితర ప్రజా రవాణా అనుమతించరాదన్నారు.
మెడికల్ విభాగాలు సహా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. నిత్యావసర సరకులు ఆంక్షల కంటే ముందే తెచ్చుకునేలా ప్రజలకు సూచించాలన్నారు. ఆసమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించేలా పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం ద్వారా తెలియజేయాలని చెప్పారు. జన సమూహాలు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, వాహనాలపై జరిమానాలు లేదా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.