అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గానికి సమీపాన కర్ణాటక రాష్ట్రానికి చెందిన పావగడలో శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి గాంచినది. శ్రావణమాస నాల్గొవ శనివారం కావటంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి బారులు తీరి.. నిరీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది.
నాలుగు వందల సంవత్సరాల క్రితం 48 బీజాక్షరాలతో కూడిన శీతల యంత్రం ఇక్కడ వెలిసిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ యంత్రం ఉన్నచోట ప్రజలు సుభిక్షంగా ఉంటారని... 1955 సంవత్సరంలో శీతల యంత్రం, శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాస శనివారాల్లో నవగ్రహ పూజలు జరుగుతాయని వివరించారు. నవగ్రహ పూజల్లో పాల్గొన్న భక్తులకు దోషాలు తొలగి కోర్కెలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు.