కరోనా కారణంగా ఉపాధి కరువై, కుటుంబ పోషణ భారంగా మారి.. బిడ్డ ఆకలి తీర్చలేక.. తల్లిదండ్రులు ఆ బిడ్డనే అమ్మేసిన ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని బుచెర్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ముత్యాలు, సునీతమ్మ భార్యాభర్తలు. వీరికి ఎనిమిది నెలల కిందట ఓ అమ్మాయి జన్మించింది. కూలీ పనులే వీరి జీవనాధారం. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు వీరికి పనులు దొరకలేదు. కుటుంబమంతా పస్తులుండాల్సిన పరిస్థితి. మరోవైపు సునీతమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో బిడ్డకు కనీసం పాలు సైతం ఇవ్వలేక ఆ చిన్నారిని బిచ్చగాళ్లకు అమ్మేశారు.
గ్రామస్థుల అడ్డగింత.. కుటుంబానికి సహాయం
బిడ్డను అమ్మేసిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. బిచ్చగాళ్లను అడ్డగించి శిశువును తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. తామంతా తోడుగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
చిన్న ముత్యాలకు వచ్చే ప్రభుత్వ పింఛనుతోనే వారు బతుకున్నారని.. ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వారికి అందజేయాలని గ్రామస్థులు కోరారు. గ్రామం తరఫున తాము కూడా సహాయం అందిస్తామని గ్రామ పెద్ద స్పష్టం చేశారు.