అనుకూలించని ప్రకృతి ఒకవైపు...అందుబాటులో లేని విత్తనాలు మరోవైపు అనంత అన్నదాతను అష్టకష్టాలు పెడుతున్నాయి. విత్తన కొరతతో పంటలు వేసే పరిస్థితి లేక ఆవేదన చెందుతున్న రైతన్నను.. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద సౌకర్యాల లేమి ఏకంగా ప్రాణాలే తీస్తోన్నాయి. అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో విత్తన పంపిణీ అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతోంది. రైతుల అవసరాలకు సరిపడా మూడు లక్షల క్వింటాళ్ల విత్తనం ఉన్నప్పటికీ, అందరికీ విత్తనం దొరుకుతుందన్న భరోసా లేకపోయింది.
విత్తన కేంద్రాల వద్ద తొక్కిసలాట
విత్తనాలు తమకెక్కడదొరకవో అన్న ఆందోళన విత్తన కేంద్రాల వద్ద తొక్కిసలాటకు దారితీస్తోంది. ఈ కారణంతో... జూన్ పదో తేదీన రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన రైతు ఈశ్వరయ్య మృతి చెందాడు. పెనుకొండ మండలం గోరంట్ల తొక్కిసలాటలో పలువురు రైతులు సొమ్మసిల్లి పడిపోయి ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా ఉరవకొండలో సిద్ధప్ప అనే రైతు... తొక్కిసలాటలో మృతి చెందాడు. పంపిణీ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడం... తమ ప్రాణాల మీదకి వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు అక్రమ రవాణా
జూలై, ఆగస్టు నెలల్లో వేరుశనగ విత్తనం అక్రమరవాణా, విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలింపు.. అన్నదాతను ముప్పుతిప్పలు పెట్టాయి. ఇన్ని జరిగినా.. వ్యవసాయశాఖ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం విత్తనాలు అందిస్తే చాలనుకున్న తమను కష్టాల పాలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.