అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం భూపసముద్రం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచిన 55 కేసుల కర్ణాటక మద్యాన్నిసెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు రాయదుర్గం సెబ్ కార్యాలయంలో అనంతపురం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి జి.రామ్ మోహన్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక మద్యానికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బంది, అధికారులు దాడులు నిర్వహించగా పొలంలోని రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.
అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పొలం యజమాని ఆర్.టి బాబు రెడ్డి కర్ణాటక సరిహద్దులో గల వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి ఇక్కడ దాచిపెట్టి చుట్టుపక్కల గ్రామాలలో ఇతరులకు అమ్ముతున్నట్లు తెలిపారు. అధిక ధరలకు మద్యం అమ్మగా వచ్చిన లాభంలో ముగ్గురు కలిసి వాటాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో...
వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామం వద్ద 700 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఆటో, రెండు ద్విచక్ర వాహనాల్లో పెనుగంచిప్రోలుకు మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి మద్యం సీసాలతో పాటు.. ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.