పరిషత్ ఎన్నికల వేళ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కనగానపల్లె మండలంలోని పలు గ్రామాల్లో ఘర్షణలు జరిగాయి. మండలంలోని ఏలుకుంటపల్లిలో పోలీసుల ఎదుటే వైకాపా ఏజంట్లు ఓటర్ల బ్యాలెట్ పత్రాలు లాక్కొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసుకున్నారని.. దీన్ని ప్రతిఘటించిన ఓటర్లపై పోలీసులు జులుం చేయటంతో తాము ఓటు వేయమంటూ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు ఆందోళన నిర్వహించారు. తమకు ఓటు వేసే హక్కు కూడా లేకుండా వైకాపా నాయకులు దౌర్జన్యాలు చేశారంటూ తెదేపా సానుభూతిపరులు ఆరోపించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా వైకాపా నాయకులు అడ్డుకున్నారని తెదేపా నేతలు తెలిపారు.
ఇదే మండలంలోని తూముచర్ల పంచాయతీలోని గుంతపల్లిలో 200 మంది తెదేపా సానుభూతి పరులను ఓట్లు వేయనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఓటు వేయటానికి వెళ్లిన నర్సింహారెడ్డి అనే తెదేపా సానుభూతిపరుడిని వైకాపా నాయకులు తలపై కర్రలతో దాడి చేశారు. పలుచోట్ల వైకాపా అభ్యర్థులు దొంగఓట్లు వేయించటానికి యత్నించటంతో తెదేపా నేతలు అడ్డుకున్నారు.
దాడి చేసుకున్న వైకాపా వర్గీయులు..
కంబదూరు మండలంలో వైకాపా కార్యకర్త వెంకటేశులుపై అదే పార్టీకి చెందిన నాగన్న అనే వ్యక్తి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవలే సర్పంచిగా గెలుపొందిన రామాంజనేయులుతో పాటు ఆయన తమ్ముడు తిక్క నాగన్న కుటుంబ సభ్యులు కలిసి తనపై మూకుమ్మడిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించినట్లు వెంకటేశ్ ఆరోపించాడు. పోలీసులు వచ్చి తనను రక్షించినట్లు బాధితుడు తెలిపాడు. కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశులును స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పరామర్శించారు.