అనంతపురంలోని ఓ పాఠశాలలో సమస్యలున్నా పనులు చేయడం లేదు.. మరోవైపు రాప్తాడు మండలం యర్రగుంటలో విద్యార్థులకు తగ్గట్టు మరుగుదొడ్లున్నా.. అదనంగా నిర్మిస్తున్నారు. అనంత గ్రామీణంలోని ఓ పాఠశాలలో స్లాబ్ వేసే విషయంలో ఇంజినీరు, కమిటీ ఛైర్మన్, గ్రామ నాయకులు, ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో పనులు ఆగిపోయాయి. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేవు. నూతన గదులు నిర్మించకుండా.. కేవలం మరమ్మతులతో సరి పెడుతున్నారు. విద్యుత్తు సామగ్రి కొనుగోలులోనూ అవినీతి చోటుచేసుకుంది. 140 పాఠశాలల్లో వైరింగ్, 930 పాఠశాలల్లో ట్యూబ్‌ల ఏర్పాటు పూర్తయింది. 222 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు పూర్తి చేశారు.
నాణ్యతపై పట్టింపేదీ?
కేకే కాలనీలోని పాఠశాలను నమూనాగా ఎంపిక చేశారు. ఇక్కడ 10వ తరగతి వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అదనపు భవనాలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ రెండు గదుల పైకప్పు దెబ్బతిని, వర్షానికి కారుతున్నాయి. ఈ గదుల స్లాబ్‌ను తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉండగా.. కింది భాగాన ప్లాస్టింగ్ చేసి లప్పం అతికించారు. ఇసుక సకాలంలో అందక, అందుబాటులో ఉన్న నాసిరకం ఇసుక, ఫ్లయాస్ పౌడరుతో కొన్ని పనులు చేస్తున్నారు. మడకశిర మండలంలో ఓ ప్రధానోపాధ్యాయుడు వంద బస్తాల సిమెంట్‌ను మరో ప్రాంతానికి తరలించారు. అధికారులు గుర్తించి సస్పెండ్ చేశారు.