Sand Mafia: అనంతపురం జిల్లాలో పెన్నానది పొడవునా ఇసుక మాఫియా పేట్రేగి పోతోందనే విమర్శలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో నదిని పంచుకొని వీరు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. పామిడి మండలం తంబాలపల్లి వద్ద ఇసుక తవ్వకాలకు జైప్రకాశ్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అక్కడ ఇసుక నాణ్యతగా లేకపోవటంతో వంకరాజుకాలువ వద్ద పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. నదిలో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి వందలాది టిప్పర్లతో పెద్దఎత్తున పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. దీనిపై అక్కడి గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో తాగునీటి పథకాలకు ప్రమాదం పొంచిఉందంటున్న రైతులు.. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
తమకు అండగా నిలవాలని తెదేపా నేత జీవానందరెడ్డిని గ్రామస్తులు కోరటంతో.. ఆయన పీజేఆర్ ట్రస్టు తరపున హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నీటి వనరులున్న వంకరాజుకాలువ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని జీవానందరెడ్డి పామిడి మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్, పామిడి సీఐలతో పాటు మైనింగ్ అధికారులు, తహసీల్దార్‌కు పిర్యాదు చేశారు. సరైన స్పందన లేనందున కోర్టు ధిక్కరణ నేరం కింద జిల్లా కలెక్టర్‌పై ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే.. మాఫియాతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారని జీవానందరెడ్డి ఆరోపిస్తున్నారు.
పామిడి మండలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని.. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.