భూమి లేకపోయినా సర్వే నంబర్లు సృష్టించి గతంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు చలామణీ చేయించిన అనంతపురం జిల్లాలోని ఓ వీఆర్ఓ... ఇప్పుడు బోగస్ కౌలు రైతుల ఖాతాల సృష్టికర్తగా మారాడు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కదరకుంట గ్రామంలో వీఆర్ఓ 25 బోగస్ కౌలు రైతు ఖాతాలను సృష్టించాడు. గ్రామస్థాయి నాయకులతో చేతులు కలిపి గుట్టుచప్పుడు కాకుండా ఖాతాలు సృష్టించినట్లు తెలుస్తోంది. భూమి యజమానులకు తెలియకుండా వారి పొలాలను వేరే వారికి కౌలుకు ఇచ్చినట్టుగా సృష్టించి రైతుభరోసా డబ్బులను పక్కదారి పట్టించాడు.
కదరకుంట గ్రామసభలో వ్యవసాయ అధికారులు కేవలం నలుగురినే కౌలు రైతులుగా గుర్తించారు. వీఆర్ఓ మరో 25 మంది పేర్లను చేర్చి ఆర్టీజీఎస్కు జాబితా పంపటం వలన ఆ బోగస్ ఖాతాలన్నింటికీ 11 వేల 500 రూపాయలు చొప్పున జమయ్యాయి. తమ భూములు ఎవరికీ కౌలుకివ్వలేదని రైతులు వాపోతున్నారు.
లక్ష్మీదేవి అనే వికలాంగురాలిని... సంగప్ప అనే రైతు భూమికి కౌలుదారుగా బోగస్ ఖాతాను సృష్టించారు. సాయం చేస్తామని చెప్పి... ఇలా మోసం చేశారని... తన పేరు మీద వారు డబ్బులు తీసుకున్నట్టుగా కూడా తనకు తెలియదని లక్ష్మీదేవి అంటున్నారు.