Ruling Party MLA Land Occupation : పేదలకు పంపిణీ చేసిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్లు అసైన్డ్ భూములను ఓ అధికార ప్రజాప్రతినిధి లాగేసుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధి కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని. 217, 219, 220, 222, 223, 224, 225, 228 సర్వే నెంబర్లలోని ఎసైన్డ్ భూములను కొనేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎకరాకు 2లక్షల 40 వేల రూపాయల చొప్పున.. 77 ఎకరాలకు రైతులు నుంచి ముగ్గురి పేరుతో విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతుల్ని.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీవనాధారమైన పొలాలు కోల్పోతున్నా.. బయటికి చెప్పడానికి కొందరు రైతులు భయపడుతున్నారంటే బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
మొలకనూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని మర్రిమాకులపల్లిలో పేద ఏస్సీ, బీసీ రైతులకు 1998లో ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. అప్పట్నుంచి వారు ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. వాటిని చౌకగా కొట్టేసేందుకు సదరు ప్రజాప్రతినిధి పథక రచన చేశారు. గ్రామంలోని ముగ్గురు వైసీపీ నాయకుల్ని రంగంలోకి దించి, రైతులతో బేరసారాలు నడిపారు. వారితో అగ్రిమెంట్లపై సంతకాలు చేయించారు. ఒక్కో రైతుకు 2 లక్షల రూపాయలు అడ్వాన్సు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా మొత్తం సొమ్ము చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 20 మంది రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకున్నారు. భూములు ఇవ్వకపోతే పొలాలకు వెళ్లే దారుల్ని మూసేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు.