అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆర్టీసీ బస్సు కింద ద్విచక్ర వాహనం పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డ మహిళలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆగింది. సిగ్నల్ పడిన వెంటనే బస్సు ముందుకు బయలుదేరింది. ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్ లో వచ్చిన ఇద్దరు మహిళలు బస్సు ముందు వైపు నుంచి వెళ్లాలనుకునే లోపు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం బస్సు ముందు చక్రం కింద పడింది. దీంతో మహిళల కాళ్లు విరిగిపోయాయి. ఈ దృశ్యం మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో "నిదానమే ప్రధానము.. ఆలస్యమైనా ముందు వెనక చూసి ప్రయాణించాలని" కామెంట్లతో వీడియోను షేర్ చేశారు. అనవసరంగా రాంగ్ రూట్లో వస్తే ప్రమాదాల బారిన పడతారని, దివ్యాంగులుగా మారతారని రాశారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.