అనంతపురం జిల్లా గాండ్లపెంట మండల కేంద్రంలోని గంగాభవానీ ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున పూజలు నిర్వహించడానికి పూజరి వెళ్లగా గేటుకు వేసిన తాళాలు ధ్వంసమై ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీఐ తమ్మిశెట్టి మధు, ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ పుటేజీని పరిశీలించగా అందులో దుండగుడి చిత్రాన్ని గుర్తించారు. సాంకేతిక నిపుణులు, డాగ్ స్కాడ్‌ను పిలిపించి వేలిముద్రలను సేకరించారు.
ఎలుగుట్టివారిపల్లి రామస్వామి ఆలయంలో ఇదే దుండగుడు గేటు తాళాన్ని పగులగొట్టాడని గుర్తించారు. గాండ్లపెంట రామాలయంలోకి కూడా వెళ్లాడని, వెలుతురు ఎక్కువగా ఉండగా వెనక్కి వచ్చాడని సీఐ తెలిపారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ వివరించారు.