అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అల్లీఫీరా కాలనీ లోని ఓ డూప్లెక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. యజమానులు ఇంట్లో ఉండగానే ఎటువంటి అలజడి లేకుండా దోపిడీకి పాల్పడ్డారు. యజమాని పరమేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటిపై నిద్రిస్తూ.. పైన తలుపుకు గడియ పెట్టారు. దొంగలు రెండు అంతస్తులపైకి చేరుకుని అదే తలుపు గుండా లోపలికి ఉన్న మెట్ల మార్గంలో కిందకి ప్రవేశించారు.
ఇంట్లోని బీరువాను పగలకొట్టి.. అందులో ఉన్న మొత్తం 35 తులాల 3 గ్రాముల బంగారు ఆభరణాలు, 62 వేల నగదు, ఒక ఐఫోన్ ఎత్తుకెళ్లారు. ఉదయం కిందకు రాగానే దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన ఇంటి యజమాని.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుంతకల్ డీఎస్పీ షరపుద్దీన్, అర్బన్ సీఐ దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.