అనంతపురం జిల్లాలో రోడ్లన్నీ పాడయ్యాయి. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి మూడు శాఖల పరిధిలో ఉంటుంది. జిల్లాలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో 170 కిలోమీటర్ల మేర హైదరాబాద్-బెంగుళూరు 44వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. స్టేట్ హైవే పరిధిలో జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రహదారులుండగా, రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ పరిధిలో 2680 కిలోమేటర్ల రోడ్లున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలో 10,650 కిలోమీటర్లు ఉన్నాయి. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులు, వివిధ కాలనీల రోడ్లు కలిపి 556 కిలోమీటర్లు, హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 280, మిగిలిన ఏడు పురపాలక సంస్థల పరిధిలో 2111 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి.
కలెక్టర్ తిరిగే రహదారి పాడైంది
జిల్లా కేంద్రం నుంచి కదిరి, చెన్నై నగరాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారికి అధికారులు కనీస మరమ్మతులు కూడా చేయటంలేదు. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చెరవుకట్టపై నుంచి బీకేఎస్ మండలానికి వేళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రతిరోజూ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వాహనాల్లో తిరిగే ఈ రహదారికి కూడా కనీస మరమ్మతులు చేయటంలేదంటే నిర్లక్ష్యం ఎంతుందో తెలుస్తోంది.
వీళ్లేప్పుడు పట్టించుకుంటారో..!
పెద్ద వడుగూరు మండలంలో జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి వర్షాలకు కొట్టుకపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేయటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి, గుంతకల్లు మండలాల్లో పట్టణాలను కలిపే పలు రోడ్డు పాడైంది. కదిరి మున్సిపాలిటి పరిధిలో నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాని రహదారి పూర్తిగా దెబ్బతింది. హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిపై మోతుకపల్లి వద్ద పెన్నానదిపై ఉన్న వంతనపై రహదారి అధ్వానంగా మారింది. అసలే ఇరుకుగా ఉన్న వంతెనకు తోడు, రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణం పావుగంట ఆలస్యమవటమే కాకుండా, వాహనాలు పాడైపోతున్నాయి.