అనంతపురం నగర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధుల విడుదలకు సుముఖత వ్యక్తంచేసింది. విజయవాడలో కనకదుర్గ ప్లైఓవర్ బ్రిడ్జిని శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రితో కలిసి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అనంత ప్రాజెక్టు అమలుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రహదారి నిర్మాణానికి రూ.90 కోట్లు ప్రకటించారు. అదనంగా రూ.220 కోట్లు కావాలని ముఖ్యమంత్రి కోరగా.. గడ్కరీ అంగీకారం తెలిపారు.
నగరంలోని కనకదాస విగ్రహం నుంచి తడకలేరు వరకూ 5 కి.మీ. మేర రూ.51 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మార్గం అధ్వానంగా ఉండేది. రెండు వరుసల ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నందున పాతూరు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పంగల్‌రోడ్డు వరకు నిర్మిస్తే నగర శివారులోని రహదారులన్నీ అభివృధ్ధి చెందినట్లే.
వంతెన సమస్యకు పరిష్కారం
గడియార స్తంభం సమీపంలోని రెండు వరుసల పై వంతెన బలహీనంగా ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వంతెన నిర్మించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వంతెనపై నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వంతెన విస్తరించాలని ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. ఇప్పటికి మోక్షం లభించింది.
ఇక్కట్లు తొలగినట్టే
పంగల్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రస్తుతం 2 వరుసల రహదారి ఉంది. అది కూడా అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు అడుగుకో గుంత ఏర్పడింది. ట్రాఫిక్ పెరిగింది. గుంతల రోడ్డులో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.90 కోట్లు మంజూరయ్యాయి. అయితే టెండరు ప్రక్రియ పూర్తికాలేదు. వాస్తవానికి బళ్లారిరోడ్డు నుంచి పంగల్‌రోడ్డు వరకూ ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉండగా ఇటీవల జాతీయ రహదారుల జాబితాలో చేర్చారు. ఈ రహదారి అభివృద్ధికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రి హామీతో రహదారికి మహర్దశ వచ్చినట్లే.