Road Accident in Anantapur:అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద కారును లారీ ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. బళ్లారిలో వివాహానికి వెళ్లిన వారు, తిరిగి అనంతపురానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లారీ అమితవేగంగా ఢీకొట్టిన తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబసభ్యులు పెను విషాదంలో మునిగిపోయారు. శుభకార్యానికి వెళ్లి వస్తూ తరలిరాని లోకాలకు మరలిపోయారంటూ తీవ్రంగా రోదించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప ఉన్నారు. ఈయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబసభ్యులను.. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరామర్శించగా.. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు.
చంద్రబాబు సంతాపం..
ఉరవకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో చంద్రబాబు ఫోనోలో మాట్లాడి.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోడ్లు అధ్వానంగా ఉండటం వల్లే ప్రమాదాలు: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉండటం వల్లే వరుస ప్రమాదాలు జరిగి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఇక ముందు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Pigeons Left in air : మరోసారి పావురాల ఎగురవేత కలకలం.. రంగంలోకి పోలీసులు