అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరోను.. ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్ (42), రామాంజనేయులు గౌడ్(38) తాడిపత్రి నుంచి ద్విచక్ర వాహనంలో యాడికి మండలం చందన గ్రామానికి వెళ్తుండగా ఇగుడూరు గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో డ్రైవర్ నరేంద్ర సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. వాహనం పుట్లురు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.