నీరు లేనిదే ప్రాణం లేదు. పంటలు, పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ఎడారులు, కొండలు, వానచుక్క ఎరగని పొడి నేలలు.. ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ మనుషులుంటారు. వాళ్లకు తాగడానికి, తిండి గింజలు పండించుకోవడానికి నీరు కావాలి. అందుకే... ప్రకృతి ఇస్తే తప్ప మరోరకంగా పొందలేని ఈ నీటి వనరు మార్కెట్ వస్తువుగా మారటం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించటమే కాదు... భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తోంది.
భూమ్మీద మూడొంతుల నీరున్నా.. పేద దేశం నుంచి పెద్ద దేశం దాకా నీటికి కటకటే. 2025 నాటికి 180కోట్ల మంది పైగా ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనా. వ్యవసాయం సహా ఇతరత్రా అవసరాల కోసం వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిపుణులు లెక్కలు వేస్తున్న తరుణంలోనే... నీరు అరుదైన వనరుగానే కాక మార్కెట్ వస్తువుగానూ మారిపోయింది. కాలిఫోర్నియాలో నీటి సరఫరా చేసే సీఎంఈ గ్రూపు వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో నీటిని చేర్చడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకృతి వనరైన నీటిని..ఇప్పటివరకూ ధనిక, పేద అనే తేడా లేకుండా అంతా సమానంగా పొందుతున్నారు. ట్రేడింగ్ వల్ల భవిష్యత్తులో ఆ అవకాశం ఉండదని వాతావరణ నిపుణులు భయపడుతున్నారు.
వాస్తవానికి కాలిఫోర్నియా కొంతకాలంగా తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతోంది. అవసరాలకు అనుగుణంగా నీటి వనరులు అందుబాటులో లేకపోవటం వల్ల పరిమితంగా ఉన్న నీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే సరఫరాకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే అక్కడే నీటిని మార్కెట్ వస్తువుగా ట్రేడింగ్‌లో పెట్టారు. దీనివల్ల ప్రణాళికాబద్ధంగా నడుచుకోవటానికి వీలు అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇదే సమయంలో నీటి కొరత అంతగా లేని దేశాల్లో నీటిని మార్కెట్ వస్తువుగా మార్చే అవకాశం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.