అనంతపురం జిల్లాలో.. ఇంటింటికీ రేషన్ అందించే వాహన డ్రైవర్ల కష్టాలు తీర్చేవారే లేరు. ఉద్యోగంలో చేరేప్పుడు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న పనికి అసలు పొంతనేలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వాహనం నడపడమేనని చెప్పి.. ఇప్పుడు అన్నీ పనులు తమతోనే చెయిస్తున్నారని వాపోతున్నారు. వేతనరూపంలో నెలకు 21 వేలు ఇస్తుండగా.. అందులో వాహనం కంతుగా 3వేలు మినహాయించి 18వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా.. అంతకన్నా ఎక్కువగానే మినహాయిస్తున్నారని డ్రైవర్లు తెలిపారు.
సరుకుల పంపిణీలో సమస్యలు..
జిల్లావ్యాప్తంగా ఇంటింటికి రేషన్ అందించేందుకు 755 వాహనాలను ఏర్పాటు చేయగా.. సరకుల పంపిణీలో తీవ్ర సమస్యలు, ఇతర కారణాలతో ఇప్పటికే చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం 582 రేషన్ వాహనాలు మాత్రమే ఇంటింటికి రేషన్ అందిస్తున్నాయి. వారిలో మరో 173 మంది సమస్యలు పరిష్కరించుకుంటే తామూ ఉద్యోగం మానేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.