అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్ రెడ్డి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చెన్నేకొత్తపల్లి మండలం నాగ సముద్రం జాతీయ రహదారి పక్కన చిట్రా పార్వతికి 4 ఎకరాల 96 సెంట్లు భూమి ఉంది. వీరు పూర్వీకుల కాలం నుంచి పట్టా కలిగి ఉండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్నందున మంచి ధర పలుకుతుందనే ఉద్దేశంతో ఆ భూమి పై కన్నేశాడు ఆర్ఐ మనోజ్ కుమార్ రెడ్డి.
అదే తడువుగా ఆ భూమికి నకిలీ పత్రాలు తయారు చేసి వేరే వ్యక్తులకు అమ్మ చూపాడు. ఆ క్రమంలో 96 లక్షల రూపాయలు అడ్వాన్స్ కొనుగోలుదారుని వద్ద నుంచి తీసుకున్నాడు. వేరుశనగ పంట సాగుచేస్తున్న ఆ భూమిలో కొనుగోలుదారుడు సర్వే చేయటం ప్రారంభించాడు. ఇది గమనించిన రైతులు వారిని అడ్డుకోగా.. ఇది తాము ఆర్ఐ మనోజ్ కుమార్ రెడ్డిని నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇది విని బాధితులు అవాక్కయ్యారు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.