ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రిలో విశ్రాంత అధికారి పోరాటం.. ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై ఆవేదన - Elderly couple s silence for justice

Retired JD couple fight for justice in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే అనుచరులు.. దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ విశ్రాంత అధికారి మౌనదీక్షకు దిగారు. కబ్జాకు గురైన భూములను కాపాడాలంటూ.. రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయిందని. న్యాయం కోరినా వైసీపీ ఎమ్మెల్యే స్పందించలేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో ఏడాది కాలంగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న.. భూగర్భ జలశాఖ విశ్రాంత జేడీ దంపతుల ఆవేదన ఇది.

వృద్ధ దంపతుల మౌన పోరాటం
వృద్ధ దంపతుల మౌన పోరాటం

By

Published : Nov 27, 2022, 7:17 AM IST

Updated : Nov 27, 2022, 11:13 AM IST

Retired JD couple fight for justice in Tadipatri: పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో.. సర్వేనెంబర్ 177 లో భూగర్భజలశాఖ విశ్రాంత జేడీ ముచ్చుకోట వెంకటరామయ్య చంద్రశేఖర్ కు 1.61 ఎకరాల భూమి ఉంది. ఆయన కుటుంబం 1894వ సంవత్సరంలో..వరదాయపల్లి గ్రామంలోని కొండపై రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం నిర్వహణ కోసం రామలింగేశ్వర ట్రస్టును అప్పట్లోనే ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ తాత 1904 లో ముచ్చుకోట గ్రామంలోని ఉన్న తమ పట్టా భూములను ఆలయ ట్రస్టు పేరుతో రిజిస్టర్ వీలునామా రాసి, ఆ భూములపై వచ్చే ఆదాయంతో రామలింగేశ్వర ఆలయంలో ధూప, దీపనైవేద్యాలు జరిపాలని చెప్పారు.

ఈ ఆలయం వీరి కుటుంబానికి చెందినదే కావటంతో దశాబ్దాలుగా చంద్రశేఖర్ తండ్రి కాంకర్యాలు జరిపేవారు. ఇప్పటికీ రామలింగేశ్వర ఆలయం, ట్రస్టు అన్నీ చంద్రశేఖర్ పర్యవేక్షణలోనే ఉన్నాయి. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ భూమిలో.. చంద్రశేఖర్ అనుమతి లేకుండా ప్రభుత్వం పాఠశాలను, పంచాయతీ కార్యాలయం నిర్మించింది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ విశ్రాంత అధికారి మౌనదీక్ష

దీనిపై హైకోర్టుకు వెళ్లిన చంద్రశేఖర్ కు కోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో ప్రభుత్వం నుంచి బాధితుడు చంద్రశేఖర్ 1.80 లక్షల రూపాయల పరిహారం అందుకున్నారు. మిగిలిన భూమిని వైసీపీ నాయకులు.. కబ్జా చేయటానికి తనపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా.. ఆయన తన అనుచరులకు ఏమీ చెప్పలేను అని అన్నట్లు చంద్రశేఖర్‌ చెబుతున్నారు.
ముచ్చుకోటలోని ఈ విలువైన భూమిలో జాతీయ రహదారి నిర్మాణానికి కొంత భాగం పోగా, 14 సెంట్లు మాత్రం మిగిలింది. రామలింగేశ్వర ఆలయ పూజారి కుటుంబం నివాసానికి ఈ భూమిలో రెండు గదులు నిర్మించాలని భావించిన చంద్రశేఖర్ ను ముచ్చుకోట వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. లక్షల రూపాయల విలువైన ఈ 14 సెంట్ల భూమిని కాజేయటానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు వృద్ధులైన చంద్రశేఖర్ దంపతులపై బెదిరింపులకు దిగారు. ఇంటి నిర్మాణానికి వచ్చిన కూలీలను, గుత్తేదారును వైసీపీ నాయకులు బెదిరించి వెనక్కు పంపారు.

ఇంటి నిర్మాణానికి ఏ కూలీలు వెళ్లకూడదని ముచ్చుకోట గ్రామంలో వైసీపీ నాయకులు అందర్నీ బెదిరించారు. కర్నూలు జిల్లా నుంచి గుత్తేదారును, నిర్మాణ కూలీలను తీసుకరాగా, వైసీపీ నాయకులు వారిని బెదిరించి ఒక్క ఇటుక కూడా పెట్టకముందే తరమేశారు. దీంతో బాధితుడు చంద్రశేఖర్.. రెవెన్యూ, పోలీసు అధికారులను ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం, బాధితుడి వద్ద ఉన్న ఆధారాల మేరకు 14 సెంట్ల భూమి చంద్రశేఖర్ కు చెందినదేనని.. ఎండార్స్ మెంట్ ఉత్తర్వుల్లో చెప్పిన పప్పూరు తహసీల్దార్ షర్మిల.. స్థానికులు అభ్యంతరం చెబుతున్నందున సివిల్ కోర్టుకు వెళ్లాలని మెలికపెట్టారు.

దీంతో చంద్రశేఖర్ దంపతులు ఏడాది కాలంగా ఆలయ స్థలంలో మౌన దీక్ష చేస్తున్నారు. బాధితుల వద్దకు ఈటీవీ ప్రతినిధి వెళ్లగానే ఎమ్మెల్యే అనుచరులు పెద్దఎత్తున స్థలం వద్దకు చేరుకొని, ఈ స్థలం తాము నిర్మించ తలపెట్టిన ఆలయానికి ఇవ్వాల్సిందేనని బెదిరింపు ధోరణితో బాధితులను హెచ్చరించారు. స్థలం చంద్రశేఖర్ దేనని, ఊరికోసం ఇవ్వాలని అడుగుతున్నట్లు వైసీపీ నేతలు పంపినవారు చెప్పుకొచ్చారు.

ఆలయానికి చెందిన 14 సెంట్ల స్థలం సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్న చంద్రశేఖర్‌ దంపతులు.. ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాన్ని ఏ అధికారి అడ్డుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆలయ ఆస్తుల కోసం పోరాటం చేస్తున్న ఈ వృద్ధ దంపతుల పక్షాన నిలవాలని ముచ్చుకోటకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2022, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details