Protests on Bellary main road: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు వాల్మీకి నగర్‌కి చెందిన కాలనీ వాసులు ఖాళీ బిందెలతో పట్టణంలోని బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో గంటకుపైగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్నికల సమయంలో కాలనీలో అభివృద్ధి పనులు చేపడతామని తమకు ఓట్లు వేసి గెలిపిస్తే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని.. హామీ ఇచ్చి గెలుపొంది.. 4 సంవత్సరాలు అవుతున్నా.. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాలనీ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదంటూ.. కాలనీవాసులు మండిపడ్డారు.
తమను ఓటర్లుగానే గుర్తిస్తున్నారు తప్ప కాలనీలోని సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో కుళాయిలు, వీధిలైట్లు, రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని పలుమార్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దేవరాజుకు మొరపెట్టుకున్న సమస్య పరిష్కరించ లేదన్నారు. త్రాగునీటి కోసం బిందెలు తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొందన్నారు.