అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో నాటుసారా నిల్వలు వెలుగు చూశాయి. అంగన్‌వాడీ కేంద్రంలో పని చేసే ఆయా లీలాబాయి ఆమె కుమారుడు నాటుసారా తయారు చేస్తూ చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో మద్దెలచెరువు తండాకు వెళ్లిన పోలీసులు.... తొలుత లీలాబాయికు ఫోన్ చేసి తలుపులు తెరవాలని చెప్పారు. తాను అందుబాటులో లేనని, వేరే ఊళ్లో ఉన్నానని అబద్ధం చెప్పటంతో పోలీసులు అంగన్‌వాడీ కేంద్రానికి వేసిన తాళాన్ని పగులకొట్టి లోపలికి వెళ్లారు.
పిల్లలకు ఆహారం వడ్డించే బకెట్లలో 25 లీటర్ల నాటు సారా నిల్వలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని అదే గ్రామంలో ఉన్న ఆయా లీలాబాయిని అదుపులోకి తీసుకుని కనగానపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మద్యం అమ్మకాలు లేకపోవటంతో లీలాబాయి, ఆమె కుమారుడు స్వయంగా నాటుసారా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. వీరిద్దరిపై కనగానపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.