లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం ఈ నెల రెండో విడత ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 8వ నెంబర్ ప్రభుత్వ చౌక డిపోదారుడు ఉదయం నుంచి పంపిణీ నిర్వహించాడు. 11 గంటలవ్వగానే దుకాణం మూసివేసి వెళ్ళిపోయాడు. కరోనా కారణంగా పూటగడవని చాలామంది మహిళలు, వృద్ధులు.. వారి సంచులను గళ్ళలో ఉంచి బియ్యం కోసం షాపు ముందరే కూర్చున్నారు.
ప్రభుత్వం అందించే బియ్యంతో కడుపు నింపు కుందామని టోకన్లతో ఉదయం 6 గంటల నుంచి భౌతిక దూరం పాటిస్తూ.. టోకెన్లతో నిలుచుంటే... కొంతమందికి టోకెన్లు లేకున్నా బియ్యం పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు. టోకెన్లు ఉన్నా తమకు బియ్యం ఇవ్వకపోవడంపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే తమ పరిస్థితిని అర్థం చేసుకుని సకాలంలో నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది షాపు వద్ద వేచి ఉన్న ప్రజలకు నచ్చజెప్పి తిరిగి రేపు రావాలని సూచించారు.