రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం కచ్చితమైన తూకాలతో పంపిణీకీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాహనాలు సక్రమంగా నడవడంలేదు. వాహనాలు నడుస్తున్నాయా? కార్డుదారులకు బియ్యం సక్రమంగా అందుతోంది? ఇవన్నీ పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ భృతి చాలక వాహన ఆపరేటర్లు రాజీనామాల చేస్తూనే ఉన్నారు. సుమారు 200 పైచిలుక వాహనాలు నిలిపివేశారు. వారి స్థానంలో వీఆర్వోల సహకారంతో డీలర్లతోనే పంపిణీ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఉచితమే కదా.. అని డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు తెరలేపారు. కార్డుకు 4 నుంచి 6 కిలోలు వరకు తూకాల్లో దోచేస్తున్నారు. దీంతో కార్డుదారులంతా లబోదిబోమంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులకు అంతా తెలిసినా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బియ్యం బస్తాలు నేరుగా చౌకధరల దుకాణాలకే తరలిస్తున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో తీసుకెళ్లి కాలనీల్లో పంపిణీ చేస్తారు. కరోనా నేపథ్యంలో ఈ నెల కోటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కార్డులోని ఒక్కో వ్యక్తికి 10 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంటే ఈ నెల 36 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వాహనదారులు, డీలర్లు, వీఆర్వోలు, పైఅధికారులంతా కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. వాహనాల్లో కూడా బియ్యం తూకాల్లో భారీ కోత పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్డుకు 3-4 కిలోలు వాహన ఆపరేటర్లు దోచేస్తున్నట్లు ఓ అధికారే పేర్కొనడం గమనార్హం. మరికొన్నిచోట్ల వాహనాలను తిప్పకుండా డీలర్లే అభ్యంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాహనాలు తిరగనిచోట డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుకాణాల్లోనే బియ్యం పంపిణీ చేస్తున్నారు. కార్డులో వ్యక్తులను బట్టి 3 నుంచి 6 కిలోల వరకు దోచేస్తున్నారు. అంతా ఏకమై కార్డుదారులను మోసం చేసి, తలా ఇంత పంచుకుంటున్నారు. సుమారు 200 పైచిలుకు వాహనాలు తిరగడంలేదు. వాటి పరిధిలో 935 మంది డీలర్లే రేషన్ సరకులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కార్డుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే.. బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఇష్టముంటే తీసుకోండి. లేకుంటే వదిలేయండని డీలర్లు కార్డుదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వందలాది క్వింటాళ్లు నల్లబజారుకు తరలిస్తున్నారు.
డబ్ల్యూఏపీ12250120బి2095 నెంబరున్న కార్డులో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున 30 కిలోలు బియ్యం రావాల్సి ఉంది. అయితే 26 కిలోల 18 గ్రాములు వచ్చింది. అంటే 3.82 కిలోగ్రాములు తక్కువ తూకం ఇవ్వడంతో కార్డుదారులు లబోదిబోమన్నారు. ఈ ఒకరిద్దరే కాదు.. చాలా మంది డీలర్లు మోసం చేసి బియ్యం కొట్టేస్తున్నారు. ఏమి చేయలేయని నిస్సహాయస్థితిలో కార్డుదారులు ఉన్నారు.
ఫిర్యాదు చేసినా..!
చౌకధరల దుకాణాల డీలర్లు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం తక్కువ తూకాలతో మోసం చేస్తున్నారని జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులకు అనేక దఫాలుగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని కార్డుదారులు, వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. తరలిస్తున్న చౌకబియ్యం ప్రతినెలా పోలీసులు పట్టుకుంటున్నారు. ఎక్కడా కేసులు నమోదు చేయలేదని తెలుస్తోంది. దీంతో ఎవరూ.. ఏమీ చేయలేరని డీలర్లు ధీమాగా ఉంటున్నారు. కార్డుదారులకు మాత్రం నష్టం తప్పటంలేదు.