అనంతపురం జిల్లాలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాయదుర్గంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామిని ప్రత్యేక రథంలో ప్రతిష్టించి మేళతాళాలతో పుర వీధుల్లో ఊరేగించారు. గుంతకల్లులోని రాజేంద్రనగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రాకారోత్సవం కన్నుల పండుగలా సాగింది. స్వామివారికి సూర్య ప్రభ వాహన సేవలు నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సమయంలో మహిళల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు మధ్య పడమర, ఉత్తర మాడవీధులు కలిసే విధంగా ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలు ప్రారంభించారు.