మూత్ర పిండం క్యాన్సర్ సోకిన వృద్ధుడికి ప్రాణం పోసిన వైద్యులు మూత్ర పిండ క్యాన్సర్ సోకిన ఓ వృద్ధుడికి అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు. కళ్యాణదుర్గానికి చెందిన 75 ఏళ్ల వృద్ధ రైతు కృష్ణా రెడ్డికి పొగతాగే అలవాటు ఉన్నందున మూత్రం ద్వారా రక్త స్రావం ఎక్కువగా అయ్యేది. అనంతపురం జిల్లాలో పలువురి వైద్యులకు చూపించినా నయంకాకపోగా.. వ్యాధిని నిర్ధరించలేక హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
మూత్రపిండ క్యాన్సర్‌గా గుర్తింపు
అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రత్యేక శిక్షణ పొందిన యూరాలజిస్టు డా. దుర్గా ప్రసాద్ గురించి తెలుసుకున్న కృష్ణా రెడ్డి బంధువులు ఆయన వద్ద పరీక్షలు చేయించారు. వృద్ధుడికి మూత్ర నాళంలో పాటు, మూత్ర పిండానికి క్యాన్సర్ విస్తరించినట్లుగా గుర్తించారు. వ్యాధి మూడో దశలో ఉండటం, కృష్ణా రెడ్డి వయసు 75 సంవత్సరాలు కావడం వల్ల కొంతమంది వైద్యుల బృందంతో కలిసి క్యాన్సర్ కణతను, మూత్రపిండాన్ని విజయవంతంగా తొలగించారు. అరుదుగా ఇలాంటి క్యాన్సర్ వస్తుందని, వృద్ధుడికి శస్త్రచికిత్స చేయటం చాలా కష్టమని, ఇలాంటి కేసుకు విజయవంతంగా వైద్యం చేయటం జిల్లాలో తొలిసారని డా.దుర్గా ప్రసాద్ తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా కృష్ణా రెడ్డికి ఉచితంగా శస్త్రచికిత్స చేసినట్లు కిమ్స్ సవేరా ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చూడండి:
శతాధిక వృద్ధురాలికి.. అరుదైన శస్త్ర చికిత్స