ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న వైసీపీ నేతల కబ్జాల పర్వం.. ‘అనంత’ నగరపాలక సంస్థ స్థలం ఆక్రమణ.! - తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి

YCP MLA BROTHER LAND ENCROACHMENT: ఎన్నికలు సమీపిస్తున్నందున ఇంటికి వచ్చే కార్యకర్తలకు.. రోజూ భోజనం వండి వడ్డించటానికి షెడ్డు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంటి ముందే నగరపాలక సంస్థ స్థలం ఉండగా, వేరే ఎతుక్కోవలసిన అవసరం ఏమిటని భావించినట్లున్నారు. అనుకున్నదే తడువుగా సుమారు 60 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

YCP MLA BROTHER LAND ENCROACHMENT
YCP MLA BROTHER LAND ENCROACHMENT

By

Published : Jan 30, 2023, 8:55 AM IST

YCP MLA BROTHER ENCROACHMENT: ప్రభుత్వ స్థలాలను కబ్జా కాకుండా కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే కంచే చేను మేసిన చందంగా మారిన పరిస్థితి అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి నగర పాలక సంస్థ స్థలాన్ని ఆక్రమించారు. తన ఇంటికి వచ్చే కార్యకర్తల కోసమని అందులో క్యాంటీన్‌నూ నిర్మించారు.

అనంతపురంలోని శ్రీనగర్‌ కాలనీలో ఎఫ్‌పీ నం 42/2000లో నగర పాలక సంస్థకు చెందిన 67 సెంట్ల స్థలం ఉంది. దీనికి ఎదురుగా రాజశేఖర్‌రెడ్డి ఇల్లు ఉంది. దీంతో నగర పాలక సంస్థకు చెందిన 3 సెంట్ల స్థలం ఆక్రమించి పక్కనే ఉన్న ప్రైవేటు స్థలాన్ని కలిపి క్యాంటీన్‌ను నిర్మించారు. దానికి వైకాపా జెండా తరహా రంగులూ వేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. పార్కింగ్‌, ఇతర సామగ్రి ఉంచడం కోసమని మిగతా స్థలాన్నీ చదును చేశారు.

ప్రస్తుతం ఇక్కడ సెంటు భూమి రూ.20 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన క్యాంటీన్‌ నిర్మించిన స్థలమే రూ.60 లక్షలుంటుంది. బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. మొదట్లో స్థానికులు ఫిర్యాదు చేస్తే.. అధికారులు వెళ్లి పనులను నిలిపేయాలని సూచించారు. స్థలం ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షించాలని వార్డు సచివాలయ సిబ్బందికి చెప్పి వదిలేశారు.

ఇంత జరిగాక కూడా షెడ్డు నిర్మాణం పూర్తిచేసి, వైసీపీ రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఎన్నికలు వస్తున్నందున కార్యకర్తలకు భోజనం పెట్టడానికి షెడ్డు నిర్మించామని, ఎన్నికలు అయిపోగానే షెడ్డు తొలగిస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి.. మున్సిపల్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

స్వయంగా ఎమ్మెల్యే సోదరుడే వేస్తున్న షెడ్డు కావటంతో అధికారులు ఏమీ చెప్పలేక చూస్తూ ఊరుకున్నారని తెలుస్తోంది. అయితే రోడ్డు పక్కను చిన్నపాటి బంకు వేసుకుంటే నానా యాగి చేసి ఇబ్బంది పెట్టే మున్సిపల్ అధికారులు.. లక్షల రూపాయల విలువైన స్థలంలో వేస్తున్న షెడ్డు మాత్రం అడ్డుకోలేకపోతున్నారని శ్రీనగర్ కాలనీ వాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details