Rains update: రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో.. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తెర్నేకల్‌లో రహదారులు కాలువల్లా మారడంతో.. బడికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కొందరు ట్రాక్టర్‌లో ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్లారు. అల్లారిదిన్నె సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఆదోనిలో లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఇస్వి గ్రామంలో కుంటచెరువు నిండి పెద్ద చెరువులోకి భారీగా వరద ప్రవహిస్తోంది. ఇస్వి, కడితోటలో పొలాలు నీట మునిగాయి.
ఆస్పరి మండలం పుప్పాలదొడ్డి సమీపంలో వాగు పొంగింది. పత్తికొండ నుంచి ఆస్పరి మీదుగా ఎమ్మిగనూరుకు వెళ్లే రహదారిలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తికొండ పరిధిలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పత్తి సహా పంటలన్నీ నీట మునిగాయి.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జోరు వానలతో... లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పగటిపూట సాధారణ వర్షపాతం నమోదవుతుండగా... రాత్రివేళ భారీ వర్షం కురుస్తోంది.
కల్యాణదుర్గం ప్రాంతంలోనూ వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కుందుర్పి మండలంలో 26 ఏళ్ల తర్వాత బెస్తరపల్లి చెరువు నిండింది. తిమ్మాపురం పెద్దవంక పొంగి ప్రవహిస్తోంది. ఎస్సీ కాలనీలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముద్దినాయినిపల్లిలో పంట పొలాలు వర్షపునీటి పాలయ్యాయి.