నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కంటిమీద(Heavy rains in nellore district) కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వానలకు సంగం మండలం చెర్లోవంగల్లు వద్ద కలుజు వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నెల్లూరు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వాగు ఉద్ధృతి పెరిగి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షాలు నెల్లూరులోని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమశిల జలాశయం నుంచి భారీగా వరద రావడం వల్ల పలుచోట్ల పెన్నానది పోర్లుకట్ట కోతకు గురైంది.
గంగాదేవికి ప్రత్యేక పూజలు...
ఇందుకూరుపేట, ముదివర్తిపాళెం వద్ద కట్టకు గండిపడి వరద జలాలు రాజీవ్ కాలనీలోకి ప్రవేశించాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భగత్‌సింగ్ కాలనీ, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరులోనూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో 2వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రెండ్రోజులుగా(Huge rains in srikalahasti) ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వానలకు ముత్యాలమ్మ గుడి వీధిలో టీ దుకాణం కూలిపోయింది. వడమాలపేట మండలం గూళ్లూరులో చెరువు నిండుకుండను తలపిస్తోంది. నగరి ఎమ్మెల్యే రోజా చెరువును పరిశీలించారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి పట్టారు.