లాక్డౌన్ కారణంగా పంటను మార్కెట్కు తరలించలేక నష్టపోతున్న రైతులను.. అకాల వర్షమూ దెబ్బతీసింది. అనంతపురం జిల్లావ్యాప్తంగా 25 మండలాల్లో ఏప్రిల్ 28వ తేదీ కురిసిన అకాల వర్షం ఉద్యాన పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. అనంతపురం జిల్లాలో పదహారు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగుచేస్తుండగా, దీనిలో సింహభాగం అరటి, బత్తాయి పంటలున్నాయి. వర్ష బీభత్సంతో అరటి తోటలు చాలాచోట్ల నేలమట్టమయ్యాయి. అసలే వ్యాపారుల జాడలేక ఆందోళనలో ఉన్న బత్తాయి రైతులను గాలి, వాన పూర్తిగా నష్టపరిచింది. జిల్లావ్యాప్తంగా 25 మండలాల్లో అకాల వర్షంతో నష్టపోయినట్లు ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసింది. వర్షం, తీవ్రమైన గాలితో 228 మంది ఉద్యాన పంటల రైతులకు మూడు కోట్ల మేర పంట నష్టపోయినట్లు తెలిపింది. పంట నష్టం అంచనాలు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
చిన్న గాలికీ… పెద్ద నష్టం
చిన్నపాటి గాలి, వర్షం వచ్చినా అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీనికి గల కారణమూ అధికారులు గతంలోనే అంచనావేశారు. ఉద్యాన పంటలు సాగుచేసుకునే రైతులు పొలం గట్లపై తప్పనిసరిగా ఎత్తుగా పెరిగే చెట్లను వేయాలని, దీనివల్ల పంట నష్టం తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.