Tragic incident in Anantapur district: ఏమైందో ఏమో సరైన కారణం తెలియదు కానీ.. ఓ తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో శవాలు నీటిపై తేలియాడటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమచారం అందించడంతో హుటహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం రంగస్వామి నగర్‌లో నివాసముంటున్న రఫీ తన ఇద్దరు కుమారులతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనలో.. రఫీ తండ్రి (35), సోహైల్ చిన్నకుమారుడు (6), ఇమ్రాన్ పెద్ద కుమారుడు (9) మృతి చెందారు. ఈ సంఘటనతో బుక్కరాయసముద్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యపై ఉన్న అనుమానంతోనే రఫీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు రోజుల (మార్చి 28) ముందు రఫీ తన భార్యతో గొడవపడినట్టు స్థానికులు చెప్తున్నారు. గొడవ జరిగిన అనంతరం మహమ్మద్ రఫీ.. ఇమ్రాన్ (9), సోహైల్ (6) ఇద్దరు కుమారులతో కలసి బయటకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో మహమ్మద్ రఫీ, ఇద్దరు పిల్లలు కనిపించటంలేదంటూ బంధువులు అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా ఇవాళ బుక్కరాయసముద్రం చెరువులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మూడు మృతదేహాలను పరిశీలించగా.. మహమ్మద్ రఫీ వారి పిల్లలుగా తేలిందని పోలీసులు తెలిపారు.