మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు మండిపడ్డారు. అమరావతిని సాధించేవరకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పార్థసారథి తెలిపారు. కేవలం హైకోర్టు ఇచ్చి రాయలసీమకు ఏదో చేసినట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని... శింగనమల తెదేపా ఇన్ ఛార్జి బండారు శ్రావణి విమర్శించారు.
కళ్యాణదుర్గంలో నల్లజెండాలతో నిరసన
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకపక్షంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో నల్లజెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజకీయ ఐకాస పిలుపుమేరకు వందల సంఖ్యలో పాల్గొన్న స్థానికులు తెలుగుదేశం కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకొని ప్రధాన వీధుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.