Protest Against Chandrababu Arrest in AP :చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. బాబుకు తోడుగా చేపట్టిన రిలే దీక్షలో ఆయన రక్తంతో సంతకం చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఆత్మకూరు పురపాలక బస్టాండ్‌లో చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. ఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న ఫొటోలు, వీడియోలు చూస్తూ జగన్ పైశాచికం ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Leaders Relay Hunger Strike for Against CBN Arrest :చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రిలే నిరాహార దీక్ష చేశారు. జగన్ దుర్మార్గపాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసేందుకు జనసేన, తెలుగుదేశం కలసి పని చేస్తాయని అన్నారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం నేతలు ఆందోళనలు కొనసాగించారు. కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.
పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో సింహాద్రిపురం, పులివెందుల నేతలురిలే నిరాహరం దీక్షలుచేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జగన్ రెడ్డి నియంతపాలన చేస్తున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేక అక్రమ కేసులు బనాయించారని సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు.
నియంతపై పోరాటం కోసం చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి కట్టుకున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఇంటి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.