అనంతపురం జిల్లా వ్యాప్తంగా 61 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను నోటిఫై చేశారు. 56 ఆస్పత్రులను పూర్తిగా తీసుకున్నారు. కానీ.. 39 ఆస్పత్రుల్లో మాత్రమే చేరికలు సాగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలే ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి. మిగతా వాటిలో ప్రైవేట్ యాజమాన్యాలే రోగులను చేర్చుకుని బిల్లులు వసూలు చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీనే కాదు.. ప్రైవేట్ పడకలు కూడా సకాలంలో రోగులకు అందుబాటులో లేవు. ఆస్పత్రుల సంఖ్యతోపాటు.. పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు అదనంగా 156 పడకలను పెంచుతున్నట్లు ఏప్రిల్ 30న కలెక్టర్ ప్రకటించారు. వీటిలో 36 ఐసీయూ పడకలు ఉన్నాయి. అయితే ఇటీవల 150 దాకా ఆక్సిజన్ బెడ్లు తగ్గించినట్లు సమాచారం. రోగులు పెరుగుతున్న తరుణంలో తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.
కళ్యాణదుర్గం ఏమైంది?
జిల్లా కేంద్రంలో కీలక ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ పడకలు పెంచడంతోపాటు.. క్షేత్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కదిరిలో ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచాలి. గుంతకల్లు ఆస్పత్రిని మరింత పటిష్టం చేయాలి. తాడిపత్రిలో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిని స్వాధీనం చేసుకుంటామని కలెక్టరు చెప్పారు. దీనిపై అతీగతీలేదు. పెనుకొండ, మడకశిర, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి ఉంది.
* ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడుకు శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో బంధువులు శుక్రవారం అనంత నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. పడకల్లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. ‘నేను జిల్లా అధికారిని.. దయచేసి చేర్చుకోండి’.. అంటూ పీడీ చేతులు జోడించి వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. చివరకు అరవిందనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్ స్థాయి 60కి పడిపోవడంతో వెంటిలేటర్ అవసరమైంది. అక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ స్ట్రెచర్ కోసమే అరగంట నిరీక్షించారు. ఈలోపు పీడీ కుమారుడు, కుమార్తెలు కలిసి దుప్పటిపై 2వ ఫ్లోర్‌కు మోసుకెళ్లారు. పడకపై పడుకోబెట్టిన తర్వాత పరీక్షించారు. అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జిల్లా అధికారికే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’