ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ.. ఆలయాలు వెలవెల.. అర్చకులు విలవిల - Priests in anantapur news

ఆశీర్వదించటం తప్ఫ యాచించేందుకు చేయి చాచని వారు. స్వామి సేవ తప్ఫ.. తప్పులు ఎరగని వారు. అభిషేకాలే.. నిత్యకృత్యం. అర్చనలే.. సమస్తం. వ్రతాలలో.. స్వామి అవతారాలు వెతికేవారు. నోములలో.. అమ్మవారి నామాలు పలికేవారు. ఇలాంటి బ్రాహ్మణుల జీవనగమనం తారుమారైంది. ఆలయాలు మూతబడుతున్నాయి. శుభకార్యాలు అడపాదడపా తప్ఫ నిత్యం సాగటం లేదు. బయటి కార్యక్రమాలు అసలే లేవు. అనంతపురం జిల్లావ్యాప్తంగా అర్చకుల పరిస్థితి దీనంగా తయారైంది.

temple
అర్చకుల అవస్థలు

By

Published : May 24, 2021, 12:01 PM IST

అర్చకులను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. పస్తులు చుట్టుముడుతున్నాయి. ఇతర సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మంత్రోచ్చారణ చేసిన గొంతుకలు మూగబోతున్నాయి. దేవుళ్ల సేవలో తరించిన చేతులు.. చేయూతకు ఎదురు చూస్తున్నాయి. కరోనా కాలంలో అర్చకుల అవస్థలు వర్ణనాతీతం.

ఇదీ పరిస్థితి

ప్రస్తుతం సర్వం కరోనా మయం కావడంతో అన్ని వర్గాలు అవస్థల పాలవుతున్నాయి. దాని ప్రభావం ఆలయాలు, అర్చకులపైనా పడింది. ఆధ్యాత్మిక క్షేత్రాలు సైతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2,860 ఆలయాలు భారీగా ఆదాయం కోల్పోయాయి. ఈ ఆలయాల బాగోగులు, ఆధ్యాత్మిక పూజలు నిర్వహించే సుమారు 8,580 మంది అర్చకులకు కూడా అష్టకష్టాలు తప్పడం లేదు. కరోనా రెండో దశ విజృంభణతో జిల్లా వ్యాప్తంగా ఆలయాల తలుపులు పూర్తిగా మూసివేశారు. అక్కడక్కడ కేవలం లఘు దర్శనాలు, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండటంతో అర్చకుల జీవనం దయనీయంగా మారింది.

ఆలయాల తలుపులకు తాళం

కరోనాతో తగ్గిన భక్తులు…

గతేడాది కరోనా విజృంభించినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు సుమారు రూ. 24 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు ఆ శాఖ అధికారుల అంచనా. హుండీ రూపంలో భక్తులు అందించే కానుకలే కాకుండా అద్దె గదుల రాబడి కూడా ఆగిపోయింది. అర్చన, హారతి, అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాలు, తలనీలాల టికెట్లు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి, కసాపురం ఆంజనేయస్వామి, మురడి వంటి పెద్ద పుణ్య క్షేత్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న ఆలయాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న అర్చకుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. భక్తుల సంఖ్య 90 శాతం తగ్గిపోవడంతో అర్చకులకు హారతి పళ్లెంలో సమర్పించే కానుకలు కూడా అందడం లేదు. ప్రభుత్వం వీరికి ప్రతి నెలా చెల్లించే వేతనాలు కూడా సకాలంలో అందడం లేదు. గౌరవ వేతనం అందక, భక్తుల కానుకలు దక్కక అర్చకులకు పూట గడవడమే కష్టంగా మారింది. పవిత్రమైన సందర్భాల్లోనూ కరోనా కారణంగా భక్తులు ఆలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

గరుత్మంతునిపై కొలువుదీరిన ఉత్సవమూర్తులు

ఉత్సవాలు.. ఏకాంత సేవలు…

ధర్మవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవలతోనే కొనసాగుతున్నాయి. ఆదివారం వేలాది భక్తులు హాజరు కావాల్సిన గరుడోత్సవం ఎవరూ లేకుండానే సాగింది. శనివారం రాత్రి స్వామి వారికి వైభవంగా కల్యాణం జరిగింది. అనంతరం ఉభయ దేవేరులతో కలసి స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. అర్చకులు కోనేరాచార్యులు, బాబుస్వామి, భానుప్రకాష్‌ జరిపిన పూజాది కార్యక్రమాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవుడు విశేషలంకార భూషితుడై గరుడవాహనంపై కొలువుదీరిన వైనం ముచ్చటగొలిపింది. దేవాలయ ధర్మకర్తల కమిటీ ఛైర్మన్‌ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పొరాళ్ల పద్మావతి పుల్లయ్య, సత్రశాల అశ్వత్థ, ఈవో బిఆర్‌ వెంకటేశులు, అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య ఉత్సవాలను పర్యవేక్షించారు.

యాడికి మండలం రాయలచెరువలోని శివగంగ మాణిక్య స్వామి ఆలయ అర్చకునిగా జీవనం సాగిస్తున్న ఈయన పేరు మల్లికార్జున. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఈయనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆలయ అర్చకత్వమే జీవనాధారం. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో జీవనం కష్టసాధ్యంగా మారింది. కుటుంబ పోషణ, పిల్లల చదువులు పెనుభారంగా మారింది. నెలవారీ వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణమోహనాచార్యులు కళ్యాణదుర్గం మండలం బొరంపల్లి గ్రామంలో 40 ఏళ్లుగా ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకునిగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఈయన అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది. ఈయన లాగే మురిడి క్షేత్రంలో యువ అర్చకునిగా విధులు నిర్వహించే అశోక్‌ కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అర్చక వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

అర్చకులకు బీమా, ధీమా కల్పించాలి…

ఆలయాల్లో పూజలు నిర్వహించే సందర్భంలో అరకొరగా వచ్చే భక్తుల్లోనూ కరోనా బాధితులుంటే అర్చకుల పరిస్థితి ఏమిటి. అర్చకత్వం నిర్వహించకపోతే ఎలాంటి ఆర్థిక ధీమా లేని తమ జీవనానికి ఒడిదుడుకులు తప్పవు. అర్చకులకు నెలవారీ చెల్లిస్తున్న వేతనాలు ప్రభుత్వం సకాలంలో చెల్లించాలి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అర్చకులకు బీమా ధీమా కల్పించాలి. ఇన్ని రోజులుగా ఆలయాలు మూతపడిన సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. అర్చకత్వం లేక, ఆదాయమిచ్చే మరో ప్రత్యామ్నాయం లేక అర్చకులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఆలయాలనే నమ్ముకున్న అర్చకులకు అధికారులు, ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. -శ్రీకాంత్‌ శర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు, అనంతపురం

ఇదీ చదవండి:శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమ నూతన భవన నిర్మాణానికి దాతల సాయం

ABOUT THE AUTHOR

...view details