హైకోర్టు ధర్మాసనం పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మేరకు.. అనంతపురం జిల్లా పెనుకొండలో ఎన్నికల హడావుడి మొదలైంది. పోలింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రిని ఉన్నతాధికారులు సమకూర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
హైకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూసిన అధికారులు.. మూడు గంటల్లోనే తీర్పు రావడంతో చకచకా ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పెనుకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు.
ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన తమకు.. ఉన్నతాధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు నిరసన చేపట్టారు. పరిషత్ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు, ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల పరిషత్ కార్యాలయానికి వివిధ ప్రాంతాల ఉద్యోగులు చేరుకున్నారు. భోజనం సహా కనీస వసతులు కల్పించలేదని ఆగ్రహించిన ఉద్యోగులు.. ఆర్వోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.